Monday, October 6, 2014



లండన్ లో చరిత్ర సృష్టించిన నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు



లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో  సెప్టెంబర్ 27-28, 2014 తేదీలలో దిగ్విజయంగా జరిగి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి తెర తీసింది. కళ్యాణి గేదెల మొదటి రోజు “మా తెలుగు తల్లికి” , రెండవ రోజు “జయ జయ ప్రియ భారత”  శ్రావ్యంగా ఆలపించిన ప్రార్థనా గీతాలతో  ప్రారంభం అయిన ఈ మహా సభలకి ఇంగ్లండ్, అమెరికా , ఫ్రాన్స్ , జర్మనీ దేశాలనుండి సుమారు 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు ప్రధాన అతిథిగా విచ్చేసి తెలుగు బాషని ప్రపంచ బాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభోపన్యాసం, కేంద్ర సాహిత్యా ఎకాడెమీ బహుమతి గ్రహీత “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కీలకోపన్యాసం చేయగా సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ తమ అద్భుతమైన ప్రసంగాలతో రెండు రోజులూ ఈ సాహిత్య సభకి వన్నె తెచ్చారు. పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ తన పద్యాలతో సభని రంజింప జేయగా, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ నేజేర్స్ తన దండక పఠనంతోనూ, సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, పత్రికా సంపాదకురాలు కేతవరపు రాజ్యశ్రీ ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచి సముచిత ప్రసంగాలు చేశారు.
ఈ మహా సభలని ఇటీవల నిర్యాణం చెందిన బాపు గారికి అంకితం ఇస్తూ జరిగిన అంకిత సభలో వంగూరి చిట్టెన్ రాజు, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల బాపు గారితో తమ వ్యక్తిగత అనుభవాలని సభికులతో పంచుకున్నారు. ఈ మహా సభల సందర్భంగా బాపు గారికి అంకితం ఇస్తూ ఎంతో తక్కువ సమయంలో డా. వెలగపూడి బాపూజీ రావు గారి సంపాదకీయంలో ఎంతో ఆకర్షణీయంగా  వెలువరించిన సావనీర్ ని,  తనికెళ్ళ భరణి రచించిన “ప్యాసా” రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం”, సుద్దాల అశోక్ తేజ కవితల ఆంగ్ల అనువాదాలు పుస్తకం, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాల సీడీ “తెలుగు రాగాంజలి”  మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ ఎ. చక్రపాణి గారి కుమార్తె నీరజ రేగుల రచించిన “మై డాడ్” అనే పుస్తకం, ఆచార్య “పద్మశ్రీ” కొలకలూరి ఇనాక్ గారి కుమార్తె మధుజ్యోతి రచించిన ఆయన జీవిత చరిత్ర “నాన్న”  ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయి.
స్వీయ రచనా పఠనం విభాగంలో డా. వ్యాకరణం అచ్యుత రామారావు, దివాకర్ అడ్డాల, డా. జొన్నలగెడ్డ మూర్తి, కేతవరపు రాజ్యశ్రీ మొదలైన వారు తమ కవితాలాపనలతో సభికులని రంజింపజేసారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి శ్రీశ్రీ, దేవులపల్లి, భానుమతి, రేలంగి, సూర్యాకాంతం, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా, బాపు- బాపూజీ మొదలైన అనేక రంగాల లబ్ధప్రతిష్టులైన పైన తను రచించిన వచన కవితలను అద్భుతంగా చదివి సభ మెప్పుదల పొందారు.
ఈ మహా సభలకి పరాకాష్ట గా యావత్ ఐరోపా ఖండంలోనే మొట్ట మొదటి సారిగా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంస్కృత పదాలు ఎక్కడా వాడకుండా అచ్చ తెనుగు పదాలతో అపురూపమైన అవష్టావధాన కార్యక్రమాన్ని, ధారణతో సహా కేవలం గంటా పదిహేను నిముషాలలో ముగించి చరిత్ర సృష్టించారు. కవి జొన్నవిత్తుల గారి సమర్థవంతమైన సంచాలకుడిగా ఆద్యంతం ఆహ్లాదంగా జరిగిన ఈ అష్టావధానంలో కేతవరపు రాజ్యశ్రీ (దత్త పది), శ్రీ రంగస్వామి (సమస్య), మాదిన రామకృష్ణ (చిత్రాక్షరి), డేనియల్ నేజేర్స్, వడ్డేపల్లి కృష్ణ (నిషిద్ధాక్షరి), అక్కిరాజు సుందర రామకృష్ణ (వర్ణన), అమెరికా ఆస్థాన అప్రస్తుత ప్రసంగి” గా పేరొందిన  వంగూరి చిట్టెన్ రాజు అప్రస్తుత ప్రసంగిగా చమత్కారమైన ప్రశ్నలతో పృఛ్చకులుగా వ్యవహరించారు. అవధానం అనంతరం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అవధాని పాలపర్తి వారి సత్కార కార్యక్రమం జరిగింది.
ఈ మహా సభలలో “భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఉండే భారత దేశం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలుగు వారు విడిపోయిన నేపధ్యంలో, హిందీ భాష అభివృద్ది నమూనాలో తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ది బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వమే చేపట్టి “కేంద్రీయ తెలుగు సంస్థ” ని ఏర్పాటు చేయాలి “ అనే తీర్మానాన్ని వంగూరి చిట్టెన్ రాజు ప్రవేశ పెట్టగా ఆ తీర్మానాన్ని నాలుగవ ప్రపంచ తెలుగు సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ సందర్భంగా ఈ రోజు ప్రారంభ సభలో వంగూరి చిట్టెన్ రాజు ప్రతిపాదించిన “యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో తెలుగు పీఠం” ఆవశ్యకతను గుర్తిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగానూ సహకరిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.యి. కృష్ణ మూర్తి, శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.
ఈ సమావేశాన్ని అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, యునైటెడ్ కింగ్డం వాస్తవ్యులు డా. మాదిన రామకృష్ణ, డా. వెలగపూడి బాపూజీ రావు, కృష్ణ యలమంచి వేదిక నిర్వహణ బాధ్యతలని చేపట్టారు. ఈ రెండు రోజుల సమావేశాలని యుక్త అధ్యక్షులు జయకుమార్ గుంటుపల్లి పర్యవేక్షించగా, కిల్లి సత్య ప్రసాద్ & వెంకట పద్మ దంపతులు అన్ని చోట్లా వారే నిర్వహణ బాధ్యతలని చేపట్టి ఎంతో సేవ చేశారు. శ్రవణ లట్టుపల్లి, నరేంద్ర మున్నలూరి నాయకత్వంలో ప్రమోద్ పెండ్యాల, రాజశేఖర్ కుర్బా, అమర్ నాథ్ చింతపల్లి, ప్రసాద్ మద్దసాని, ఉదయ్ కిరాణ్ బోయపల్లి, ఉదయ్ ఆరేటి, కృష్ణ యలమంచిలి, సుదీర్ కొండూరు, బలరామ్ ప్రసాద్ తదితరులు ఎంతో శ్రమ కోర్చి ఈ మహా సభలు విజయవంతం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించారు.
ఈ ప్రతిష్టాత్మక నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు  దృశ్య మాలిక ఈ క్రింది లంకె లో చూడండి.



No comments: