Friday, August 6, 2010

అంతర్జాతీయ తెలుగు మహిళా రచయితల
 రెండవ సాహిత్య సమ్మేళనం
ఆగస్టు 29-30-31, 2010
ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల దాకా
శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి, హైదరాబాదు
ఈ సందర్భంలో "ఆంధ్ర ప్రభ" వారి సౌజన్య, సహకారాలతో, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు "మొట్ట మొదటి అంతర్జాతీయ మహిళా రచయితల కథల పోటీ" నిర్వహిస్తున్నారు. పది మంచి కథలకి ఒక్కొక్కటీ ఐదు వేల రూపాయల సమాన బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీకి మాకు కథలు చేరవలసిన ఆఖరి తేదీ ఆగస్టు 25, 2010. పూర్తి వివరాలకు vangurifoundation@yahoo.com ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
తెలుగు భాషాభిమానులకు సాదర ఆహ్వానం
ఉచిత ప్రవేశం

గత ఏడాది (2009) మార్చ్ లో జరిగిన "మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహిళా రచయిత్రుల సాహిత్య సమ్మేళనం" లో ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకూ తమదైన వేదికపై సుమారు 80 మంది మహిళా రచయితలూ, సాహితీవేత్తలూ పాల్గొని, అనేక సాహితీపరమైన అంశాలపై ప్రసంగించి, తెలుగు సాహితీ ప్రపంచంలో మహిళా రచయిత్రుల ప్రాభవాన్ని చాటి చెప్పి చరిత్ర సృష్టించారని పత్రికలలోనూ, టీవీ ప్రసారాలలోనూ వార్తలు వెలువడ్డాయి.
ఆనాటి స్పూర్తితో, ప్రపంచవ్యాప్తంగానూ, ముఖ్యంగా భారతదేశంలో నలుమూలలా ఉన్న తెలుగు మహిళా రచయితలకి తమదే అయిన మరొక సాహిత్య వేదిక ఏర్పాటుచేసే సదుద్దేశ్యంతో, ఈ నెల, అనగా, ఆగస్టు 29-30-31 వ తేదీలలో హైదరాబాదులోని శ్రీ త్యాగరాజ గానసభ ప్రధాన ప్రాంగణంలో "అంతర్జాతీయ తెలుగు మహిళా రచయితల రెండవ సాహిత్య సమ్మేళనం" జరగబోతోంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్) వారు ప్రధాన నిర్వాహకులు.
సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యాలు

1. తెలుగు రచయిత్రులు తెలిసిన స్నేహితులతోబాటు అనేక ప్రాంతాలనుంచి వచ్చే తోటి వారిని కలుసుకుని, సాహిత్యపరంగా ముచ్చటించుకోవడం. కొత్త పరిచయాలు పెంచుకోవడం.
2. తెలుగు రచయిత్రులు తమ సాహితీపాటవాన్ని ఇతరులతో పంచుకుని, ఇతరులనుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం.
3. అన్నింటికంటే ప్రధానంగా రచయిత్రులుగా, సాహితీవేత్తలగానే కాకుండా, మాతృమూర్తులుగా, సోదరీమణులుగా, ఇతరత్రా తెలుగువారందరి జీవితాలలో కేంద్రబిందువులైన మహిళలు, మనందరికీ కన్నతల్లి అయిన తెలుగు భాష, సాహిత్యాల అభివృధ్ధికి తాము చేయదగిన, చేయవలసిన కృషి, పై చర్చల ద్వారా ఈ మహిళా సదస్సు మంచి అవగాహన, దిశానిర్దేశం కలిగిస్తుందని మా నమ్మకం. మహిళా సాహితీవేత్తలు తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ అందరూ అనుమానిస్తున్న "మరణ శయ్య" నుంచి రక్షించగలరని మా నమ్మకం.
మహిళలు ప్రధాన నిర్వాహకులుగా ఉండే ఈ మహా సభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులూ, రచయితలూ, భాషాభిమానులూ మొదలైన వారందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
మహిళా వక్తలకు ఆహ్వానం, విన్నపం
సాహిత్యపరమైన విషయాలపై ప్రసంగించి, తమ అభిప్రాయాలను ఇతర రచయిత్రులూ, సాహిత్యాభిమానులతో పంచుకోవాలని అభిలషించే మహిళావక్తలందరికీ ఈ సమ్మేళనం ఒక వేదిక. ఈ సదస్సులో వక్తలుగా పాల్గొన దల్చుకున్న రచయిత్రులు, తాము ప్రసంగించదల్చుకున్న అంశాల వివరాలతో ఈ క్రింది వారిని సంప్రదించండి. ప్రత్యేక పరిస్ఠితులలో తప్ప ఏ ప్రసంగానికైనా కేటాయించిన సమయం పదిహేను నిముషాలు. ఈ సమ్మేళనంలో ప్రసంగించదల్చుకుంటే ఆసక్తి, సాహిత్యపరమైన ప్రసంగాంశం వివరాలు మాకు తెలియవలసిన ఆఖరి తేదీ ఆగస్టు 20, 2010. అన్ని విషయాలలోనూ తుది నిర్ణయం నిర్వాహకులదే.

డా. తెన్నేటి సుధా దేవి (Hyderabad)
Phone: 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in
శ్రీమతి ఇంద్రగంటి జానకీ బాల (Hyderabad)
Phone: (40) 27794073.

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు
అధ్యక్షులు
వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా
USA Phone: 832 594 9054
E-mail: vangurifoundation@yahoo.com