Thursday, September 9, 2010

రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం దిగ్విజయం

రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం ఆగస్టు 29-30-31 వ తారీకులలో దిగ్విజయంగా ముగిసింది. హైదరాబాదు లో శ్రీ త్యాగరాజ గానసభలో జరిగిన ఈ సమ్మేళనంలో ప్రధానాంశాలు ఈ క్రింద పొందుపరిచాం.

1. మొదటి రోజు (ఆగస్టు 29, 2010). ఉదయం 9 గంటలనుంచి రాత్రి పది గంటలదాకా జరిగింది ప్రారంభోత్సవ సభలో డా. వి.యస్. రమాదేవి, డా. ఆవుల మంజులత, డా. అరుణా వ్యాస్, సుమతీ కౌషల్ మొదలైన వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలనుంచి ఎంపిక కాబడిన తెలుగు ఉపాధ్యాయినులను సముచితంగా సత్కరింఛారు. (శ్రీమతులు చుండి కృష్ణవేణి, జి. శ్యామల, ఆలమూరు శ్యామల, గరిమెళ్ళ సీతాదేవి, ఏలూరి ఝాన్సీ రాణి). తరువాత సాయంత్రం వరకూ 30 మంది మహిళల స్వీయ రచనా పఠనం, సాహిత్య ప్రసంగాలు, చర్చా వేదికలు జరిగాయి. అనంతరం, డా. లలితా కామేశ్వరి మరియు కె. రమాకుమారి నాట్యావధానం చెయ్యగా, ప్రత్యేక కార్యక్రమంగా "జయహో శ్రీ కృష్ణదేవరాయా" అనే కూచిపూడి నృత్యనాటకం జనరంజకంగా ప్రదర్శింఛబడింది. డా. సి. నారాయణ రెడ్డి నటీనటులనూ, నర్తకులనూ సముచిత రీతిగా సత్కరించారు.

2. రెండవ రోజు (ఆగస్టు, 30, 2010) సమ్మేళనం సాయంత్రం నాలుగు గంటలనుంచి పది గంటలదాకా సాగింది. శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి ప్రత్త్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సుమారు 25 మంది రచయిత్రుల సాహిత్య ప్రసంగాలు, చర్చావేదికల తరువాత రాయల నాటి కవయిత్రుల పాత్రలతో భామినీ భువన విజయం అనే రూపకం దిగ్విజయంగా ప్రదర్శించబడింది.
3. మూడవరోజు (ఆగస్టు 31, 2010) సమ్మేళనం శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారి ప్రసంగంతో ప్రారంభం అయి,  సాయంత్రం నాలుగు గంటలనుంచి పది గంటలదాకా జరిగింది. ముగింపుగా ఆంధ్ర ప్రభ-వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహణలో జరిగినిన "మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీ"లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం అత్యంత వైభవంగా జరిగి ఈ మూడు రోజుల మహిళా రచయితల సాహిత్య సమ్మేళనానికి పరాకష్టగా నిలిచింది. ఈ ముగింపు సభలో డా. సి. నారాయణ రెడ్ది, డా. నన్నపనేని రాజకుమారి (శాసన సభామండలి సభ్యులు), గౌతమ్ ముత్తా (ఆంధ్ర ప్రభ అధినేత), పి .విజయబాబు ( ఆంధ్ర ప్రభ ప్రధాన సంపాదకులు) , బొప్పన పద్మ (కెనడా), ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కథల పోటీలో విజేతలైలు అల్లూరి గౌరీలక్ష్మి (హైదరాబాదు), కల్లూరి శ్యామల (న్యూ ఢిల్లీ), కె.బి. లక్ష్మి (హైదరాబాదు), కె. వాసవ దత్త రమణ ( (హైదరాబాదు), కె. రాధా హిమబిందు (మణుగూరు), పి,వి, భగవతి (న్యూ జెర్సీ, అమెరికా), పి. శాంతాదేవి (న్యూ ఢిల్లీ), బి, గీతిక (జిన్నూరు, తూ.గో జిల్లా), రావులపల్లి రామలక్ష్మి (విశాఖపట్నం), శ్రీదేవీ మురళీధర్ ((హైదరాబాదు). ఈ పది మందికీ ఐదు వేల రూపాయల సమాన బహుమతి, ప్రశంశాపత్రమూ, జ్ఞాపిక బహూకరించబడ్డాయి.

సదస్సులో పాల్గొన్న శతాధిక రచయిత్రులలో స్థానిక వక్తలకి రూ.116 నగదు పారితోషికమూ, సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి రూ.1,116 నగదు, అందరికీ తెలుగు పుస్తకాలూ, ప్రశంసాపత్రమూ, జ్ఞాపిక బహూకరించబడ్డాయి.

డా. తెన్నేటి సుధాదేవి, డా. జానకీ బాల ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించగా, డా. నాగరంజని, బాలాత్రిపుర సుందరి, శైలజా రాణి, శృతకీర్తి, సుధామయి, పద్మజా మల్లాది మొదలైన వారు పూర్తి సహకారాన్ని అందించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హైదరాబాదు) సంస్థ మేనేజింగ్ ట్రస్టీ వంశీ రామరాజు, చైర్మన్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వైస్ చైర్మన్ "రచన" సాయి , ధర్మారావు మొదలైన వారు ఈ సదస్సుకు వెన్నెముకగా నిలిచారు.

ఈ  అంతర్జాతీయ మహిళా సదస్సుకు రూపకల్పన చేసిన వారు వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్).
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఈ రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం (ఆగస్టు 29-30-31), తదితర సాహితీ సదస్సుల చిత్ర మాలికలు, వార్తా విశేషాలూ (ఈ నాడు, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, ప్రజాశక్తి, సూర్య, సాక్షి) ఈ క్రింది లింక్ లో చూడండి.