Thursday, November 5, 2015

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లో తెలుగు శాఖ అభివృద్ది శాశ్వత నిధి ఏర్పాటు ప్రారంభోత్సవ సభ దిగ్విజయం







యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లో తెలుగు శాఖ అభివృద్ది 
శాశ్వత నిధి ఏర్పాటు ప్రారంభోత్సవ సభ దిగ్విజయం
ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి తెలుగు విభాగం అభివృద్దికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ నెలకొల్పిన “శాశ్వత నిధి” (VFA Program Endowment For Telugu Studies) ప్రారంభోత్సవం నవంబర్ 3వ తారీకున దిగ్విజయంగా జరిగింది.  ఆ విశ్వ విద్యాలయం లోని సౌత్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ మెయేర్సన్ కాన్ఫెరెన్స్  మందిరం లో జరిగిన ఈ ప్రారంభోత్సవ సభలో అమెరికాలోనే అతి పెద్ద ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ విభాగం డీన్ డా. రాండీ డీల్,  సౌత్ ఏషియన్ స్టడీస్ విభాగం చైర్ పర్సన్ డా. మార్తా సేల్బీ, డైరెక్టర్ అస్తర్ ఆలి, విశ్వవిద్యాలయ శాశ్వత నిధి నిర్వాహకురాలు కేత్లీన్ ఏరన్సన్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొన్నారు.  ఆచార్య అఫ్సర్ గారు అందరికీ సాదర ఆహ్వానం పలకగా  డీన్ డా. డీల్ ప్రారంభోపన్యాసంలో గత యాభై ఏళ్ల ఆ డిపార్ట్ మెంట్ చరిత్రలోనే ఈ ఇటువంటి శాశ్వత నిధి ఏర్పాటు ఇదే మొదటి సారి అని ప్రకటించి ఈ మొదటి మెట్టుకి స్వీకారం చుట్టిన వంగూరి ఫౌండేషన్ కి అభినందనలు తెలిపారు. డా. వంగూరి చిట్టెన్ రాజు చతురోక్తులతో మాట్లాడుతూ అమెరికాలో యువ తరానికి విశ్వవిద్యాలయ స్థాయిలో మన సాంస్కృతిక భాష అయిన తెలుగు సాహిత్యం పై అవగాహన కలిగించడానికి తమ వంతు కృషిలో భాగం గా ఈ శాశ్వత నిధి ఏర్పాటు చేస్తున్నట్టు విశదీకరించి, వచ్చే ఏడు ఆ విశ్వ విద్యాలయం సహకారంతో అమెరికాలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులు, విద్యార్థులూ పాల్గొనే విధంగా ఒక దేశవ్యాప్త సమావేశం జరగాలని హర్షధ్వానాల  మధ్య ప్రతిపాదించారు. చైర్ పెర్సన్ డా. మార్తా షెల్బీ ప్రసంగిస్తూ, అఫ్సర్ గారి సమర్థవంతమైన నిర్వహణలో తెలుగు శాఖ అభివృద్దికి,  వంగూరి ఫౌండేషన్ వారి  ప్రతిపాదనలకీ తమ అండదండలు ఉంటాయి అనీ హామీ ఇస్తూ, చరిత్ర సృష్టించిన ఈ “VFA Program Endowment Fund for Telugu Studies”  ఏర్పాటు కి తమ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేథ్లీన్ ఏరన్సన్ ఆధ్వర్యంలో శాశ్వత నిధి అధికారిక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవంలో లాంఛన ప్రాయం గా $25,000 చెక్కుని దాతలందరి తరఫునా డా. వంగూరి చిట్టెన్ రాజు డీన్ డా. రాండీ డీల్ గారికి బహూకరించారు. డైరెక్టర్ అస్తర్ ఆలీ అన్ని భారతీయ భాషల పై అక్కడ జరుగుతున్న పరిశోధనలు, భాషా బోధనలు వివరించారు.  ఈ ప్రారంభోత్సవ సభకి అన్ని ఏర్పాట్లూ చేసి తెలుగు శాఖ ఆచార్యులు డా. అఫ్సర్ సభని దిగ్విజయంగా నిర్వహించారు.   
ఈ ప్రారంభోత్సవ సభకి తెలుగు శాఖలో చదువుకుంటున్న సుమారు 50 మంది యువతీ యువకులూ, స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు శ్రీ సంగమేశ్వర్, ఇతర కార్యవర్గ సభ్యులు, భారత దేశం లో వంగూరి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ వంశీ రామరాజు గారు విచ్చేశారు. సభానంతరం సుప్రసిద్ద గాయనీగాయకులు శ్రీదేవి (హైదరాబాద్) & పి.వి. రమణ (కాకినాడ) తమ గాన కౌశలంతో సభికులని ఆకట్టుకుని గౌరవ పురస్కారాలు అందుకున్నారు.
దాతలకి ప్రత్యేక కృతజ్ఞతలు
కొన్ని నెలల క్రితం ఈ శాశ్వత నిధి ఆలోచనని మీతో పంచుకుని మీ సహాయాన్ని అర్థించగానే సత్వరం స్పందించి సుమారు $10,000 వరకూ తమ వంతు ఆర్ధిక సహకారాన్ని అందించిన ఈ క్రింది తెలుగు భాషాభిమానులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వీరిలో అమెరికాలో అనేక ప్రాంతాలనుంచే కాకుండా అటు భారత దేశం నుంచీ, ఆస్ట్రేలియా నుంచీ దాతలు స్పందించడం గమనార్హం. నవంబర్ 3, 2015 ప్రారంభ సభలో తొలి విడతగా మేము $15,000 నిధిని సమకూర్చగలిగాం. మిగిలిన సొమ్ము త్వరలోనే అందించి, ప్రతీ ఏడూ సాధ్యమైనంత వరకూ ఆ నిధిని పెంచుతూ ఎక్కువ మంది విద్యార్థులకి ఆ తెలుగు శాఖలో నమోదు చేసుకునే అవకాశాలు ఎక్కువ చేయాలని మా సంకల్పం. 
మహారాజ పోషకులు ($2000): యలమంచిలి చౌదరి (హ్యూస్టన్)  
చక్రవర్తి పోషకులు: ($1000): శంకర్ ప్లంజేరి (హ్యూస్టన్), శాయి రాచకొండ (హ్యూస్టన్), చదలవాడ మోహన్ (బెంగళూరు)
రాజ పోషకులు ($500): రజని కాంత్ అనుపోజు (Folsom, CA), మధు పెమ్మరాజు (హ్యూస్టన్), ప్రకాశ రావు అనంతనేని (రిచ్ మండ్, టెక్సస్), పోతు నరసింహా రావు (హ్యూస్టన్), రామా ఆధారపురపు (హ్యూస్టన్)
యువరాజ పోషకులు ($250): కలపటపు వేణుగోపాల రావు (హ్యూస్టన్), దేశరాజు కృష్ణ బాబు (హ్యూస్టన్), సునీల్ బట్టెపాటి (డల్లాస్), ఉమా భారతి కోసూరి (హ్యూస్టన్), వెంకట కొంపట్ల (హ్యూస్టన్), MVL ప్రసాద్ (Dallas), చిలుకూరి సత్యదేవ్ (హ్యూస్టన్)
భాషా పోషకులు($100): శివరామ ప్రసాద్ వింజమూరి (Cerritos, CA), మధిర మూర్తి (పోర్ట్ లాండ్), కుమారి సామినేని (Austin), రవి గొర్తి ((హ్యూస్టన్), నవీన్ నంబూరి (Australia), సుబ్రహ్మణ్యం చాగంటి (Chantily, VA), రామశాస్త్రి గుడిమెట్ల (Springborn, OH), రామసూర్య రెడ్డి (Dallas), శ్రీకాంత్ గోటేటి (Scarsdale, NY), నాగ సంపత్ వారణాసి (Dublin, OH), శ్యామా పప్పు (చికాగో, Il)), కట్టా మూర్తి (Ann Arbor, MI), రమేష్ వాసిరెడ్డి (Oakland, CA), బులుసు నారాయణ (Castro Valley, CA), జయదశ్రీ కల్లూర్ (హ్యూస్టన్)
ఇంచు మించు అందరి దాతలకీ కృతజ్ఞతా పూర్వకంగా గత నెల విడుదల అయిన మా 59వ  ప్రచురణ “కలికి కథలు” (వెంపటి హేమ గారి 50 కథల సమగ్ర సంపుటి – 600 పేజీలు) బహుమతిగా త్వరలోనే పంపిస్తాం. దాతల పట్టీలో ఎవరిపేరు అయినా మర్చిపోయినా, తప్పులున్నా దయతో మన్నించి మాకు తెలియజేయండి. అమెరికాలో విరాళాలకి పన్ను రాయితీ లభిస్తుంది.   

ఆత్మీయంగా స్పందించి మాకు నైతిక & ఆర్ధిక ప్రోత్సాహాన్ని కలిగించిన తెలుగు భాషాభిమానులకి మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాతో అన్ని విధాలుగానూ సహకరించిన కవి, ఆచార్య అఫ్సర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 
  
భవదీయుడు

వంగూరి చిట్టెన్ రాజు
ఫోన్: 832 594 9054