హ్యూస్టన్ లో దిగ్విజయంగా ముగిసిన అమెరికా కథ స్వర్ణోత్సవాలు
& 9 అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర
వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య
ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఉత్తర అమెరికా తెలుగు కథ స్వర్ణోత్సవాలు
ప్రధాన అంశంగా హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్
25 -26, 2014 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించబడిన “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” దిగ్విజయంగా ముగిసింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ సాహితీ
సదస్సుకు హ్యూస్టన్ సాహితీ లోకం బృందం ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించగా స్థానిక తెలుగు
సాంస్కృతిక సమితి (మారుతి రెడ్డి) తగిన సహాయం అందించారు.
తెలుగు నాట వర్తమాన రాజకీయ వాతావరణంలో “ప్రపంచ భాషగా పురోగమించు,
లేదా స్థానికంగానే ఉండి పోయి క్షీణించు” అనే సందేశంతో వంగూరి చిట్టెన్ రాజు సదస్సు
ఆశయాల వివరణతో మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకూ ఎంతో వైభవంగా
జరిగిన ప్రారంభ సభలో ప్రధానోపన్యాసం చేస్తూ “అమెరికా తెలుగు కథ స్వర్ణోత్సవాలు జరుగుతున్న
ఈ రోజు తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది” అని డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన అభిప్రాయాన్ని
వెలిబుచ్చారు. ఈ సదస్సును అమెరికాలో భారతదేశ కాన్సల్ జనరల్ గౌ. పి. హారీష్ ప్రారంభించగా,
ఆహ్వానిత అతిథులుగా వచ్చిన ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి (గుంటూరు దళిత విశ్వ విద్యాలయ
ఉప కులపతి) తన ఆధ్వర్యంలో అమెరికా తెలుగు కథ పై నాగార్జున యూనివర్సిటీ లో అమెరికా తెలుగు
కథ మీద తన్నీరు కళ్యాణ్ కుమార్ చేసిన డాక్టరేట్ పట్టా గురించి ప్రస్తావించి, ఈ సదస్సు
ప్రధానాంశం అయిన అమెరికా తెలుగు కథ యాభై ఏళ్ల ప్రస్థానంపై ఎంతో విశిష్టమైన కీలకోపన్యాసం
చేశారు. ప్రత్యేక ఆహ్వానితులైన డా. ముక్తేవి భారతి (హైదరాబాద్), సుప్రసిద్ధ కవి డా.
పాపినేని శివశంకర్ (గుంటూరు] తమ సాహిత్య ప్రసంగాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.
తరువాత జరిగిన “సదస్సు అంకిత సభ” లో ఉత్తర
అమెరికాలో తెలుగు సాహిత్యం ఆవిర్భవించిన 1964 నుండి 1974 వరకూ వెలువడిన మొట్టమొదటి
తెలుగు కథ, పత్రికల కాపీలని తెరపై ప్రదర్శించి తొలి దశకం చరిత్రను సమీక్షించి ఉత్తర
అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి కుటుంబాన్ని (ఎడ్మంటన్
(కెనడా), అమెరికా తొలి కవి & తొలి తెలుగు పత్రిక సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు
వేణుగోపాల రావు గారి కుటుంబాన్ని (అట్లాంటా & పోర్ట్ లాండ్) ఘనంగా సత్కరించారు.
ప్రత్యేక అంశాలుగా డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నూతన రచన “నరేంద్ర మోదీ – ఒక పరిచయం”,
ఆచార్య కృపాచారి నూతన ప్రచురణ “ప్రాణహిత” కథా సంపుటి ఆవిష్కరించబడ్డాయి. 94 ఏళ్ల వయసులో
సుప్రసిద్ధ జానపద గాయని “కళా ప్రపూర్ణ” డా. ఎ. అనసూయా దేవి గారు సభాధ్యక్షులుగా ఆశీస్సులు
అందించగా ఈ ప్రారంభ సభా కార్యక్రమాన్ని వంగూరి చిట్టెన్ రాజు సహజసిద్ధమైన హాస్య చతురతతో
సమర్ధవంతంగా నిర్వహించారు.
మధ్యాహ్న భోజన విరామం తరువాత వంగూరి చిట్టెన్ రాజు & తనీరు
కళ్యాణ్ కుమార్ రచించిన అమెరికా కథా సాహిత్యం – ఒక సమగ్ర పరిశీలన , అమెరికా తెలుగు
కథానిక -12 వ సంకలనం (శాయి రాచకొండ& వంగూరి సంపాదకులు), పెమ్మరాజు వేణు గోపాలరావు
కవితా సమాహారం “ఆత్మార్పణ” (విన్నకోట రవిశంకర్ సంపాదకులు), కోసూరి ఉమా భారతి నవల “ఎగిరే
పావురమా”, అపర్ణ మునుకుట్ల గునుపూడి కథా సంపుటి “ఘర్షణ”, (వంగూరి ఫౌండేషన్ ప్రత్యేక
ప్రచురణలు) & ఉమా పోచంపల్లి గారి “A few poems from my heart” గ్రంధం ఆవిష్మరించబడ్డాయి.
మొదటి రోజు కార్యక్రమాలకి పరాకాష్టగా అమెరికా తొలి కథకులు శ్రీమతి
చెరుకూరి రమాదేవి, డా. వేమూరి వేంకటేశ్వర రావు, హైదరాబాద్ నుంచి వచ్చిన డా. ముక్తేవి భారతి గారికి జీవిత కాల పురస్కార మహాసభ
ఎంతో వైభవంగా జరిగింది. తదనంతరం సత్యభామ పప్పు, రామ్ చెరువు , తదితరుల ఆధ్వర్యంలో స్థానిక “స్వర మాధురి” చిన్నారులు చక్కటి సంగీత
విభావరి తో అందరినీ అలరించారు.
ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా జరిగిన ఈ రెండు
రోజుల అద్వితీయ సాహితీ సదస్సులో శాయి రాచకొండ, చిలుకూరి సత్యదేవ్, తదితరులు
నిర్వహించిన ఆరు సాహిత్య ప్రసంగ వేదికలలో భారతదేశం నుంచి వచ్చిన ముక్తేవి భారతి, పాపినేని
శివశంకర్, ఆచార్య కృపాచారి, ఆకెళ్ళ రాఘవేంద్ర, జి. భగీరథ, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన
సారధి మోటమర్రి, అమెరికాలో అనేక నగరాల నుంచి వచ్చిన ఆహ్వానిత సాహితీవేత్తలు చెరుకూరి
రమాదేవి, కిరణ్ ప్రభ, వేమూరి వేంకటేశ్వర రావు, విన్నకోట రవిశంకర్, ఎస్. నారాయణస్వామి, గొర్తి బ్రహ్మానందం, కల్పన రెంటాల, చంద్ర కన్నెగంటి, అఫ్సర్, యడవల్లి రమణ మూర్తి, శొంఠి శారదా పూర్ణ, శ్రీ బసబత్తిన మొదలైన వారు విభిన్న
అంశాలపై సాధికారంగా అత్యంత ఆసక్తికరమైన ప్రసంగాలు
చేయగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన డేనియల్ నేజేర్స్ అచ్చ తెలుగులో మాట్లాడి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. స్వీయ రచనా విభాగంలో
యువకవి శరత్ సూరంపూడి కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి.
“తెలుగు భాష –ప్రపంచ భాష“ అనే అంశంపై ఎంతో కీలకమైన చర్చావేదికలో ఎంతో మంది తమ విలువైన అబిప్రాయాలని
వెలిబుచ్చారు. ఆఖరి అంశంగా “తెలుగు ప్రాంతం ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా
విడిపోయిన సందర్భంలో అనేక రాజకీయ, ఆర్ధిక వత్తిడుల
ప్రభావంలో మెరుగుపడడానికి బదులు ఈ రెండు ప్రభుత్వాల నిరాసక్తత, నిర్లక్ష్యం మరింత పెరిగి తెలుగు భాషా, సాహిత్యాలు
రెండిటికీ చెడ్డ రేవడిలా పూర్తిగా క్షీణించే పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై ఉన్నత స్థాయి
పరిశోధనలు, ఇతర భాషా శాస్త్రవేత్తలకు తెలుగు భాషాసాహిత్యాలపై
శాస్త్రీయ అవగాహన, నూతన సాహిత్యం వెలువడడానికి అనువైన
వాతావరణం మొదలైన అత్యవసరమైన, బలమైన పునాదులు విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనా
పీఠాలను నెలకొల్పుకుని తెలుగు భాషాసాహిత్యాలను ద్వారా అమెరికాలోనూ, ఇతర దేశాలలోనూ
ఉన్న మనమే కాపాడుకోవలిసిన సమయం ఆసన్నమయింది అని ఈ సదస్సు భావిస్తోంది.” అనే సదస్సు
తీర్మానాన్ని వంగూరి చిట్టెన్ రాజు ప్రవేశ పెట్టగా ఆ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం
పొందింది.
మొదటి రోజు “మా తెలుగు తల్లికి “, రెండవ రోజు “జయ జయ ప్రియ భారత”
ప్రార్ధనా గీతాలు అత్యంత శ్రావ్యంగా, స్వచ్చమైన ఉచ్చారణతో సభా ప్రారంభం చేసిన ఏడేళ్ళ
చిన్నారులు లాస్య ధూళిపాళ, అలకనంద నూతలపాటి
ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఎంతో ఆత్మీయంగా, నిజమైన సాహిత్యాభిలాషతో, తపనతో అమెరికా తెలుగు కథా, సాహిత్యాల
స్వర్ణోత్సవాలను జరుపుకుంటూ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ సదస్సు ప్రధాన నిర్వాహకులుగా
అహర్నిశలూ శ్రమించిన శాయి & లలిత రాచకొండ, చిలుకూరి సత్యదేవ్, రామ్మోహన్ చెరువు,
శారద ఆకునూరి, సత్యభామ పప్పు, రవి పొన్నపల్లి, నూతలపాటి వెంకటేష్ & జ్యోత్స్న,
రాజ్ పసల, సీతారామ్ అయ్యగారి, కృష్ణ కీర్తి, మధు పెమ్మరాజు, కలగా రాజ రాజేశ్వరి, మాలా
రావు, శర్మ నూతలపాటి మొదలైన వారు అందరి ప్రశంసలూ అందుకున్నారు.
ఈ సదస్సు ఫోటోలు ఈ క్రింది లంకె లో చూడవచ్చును.
టీవీ 9 వారు కూడా
ఈ సదస్సుని గుర్తించి వార్తాప్రసారం చెయ్యడం ముదావహం. ఆ లంకె ఈ క్రింద ఇచ్చాం.
గూగుల్ లో కానీ, యు ట్యూబ్ లో “9th Sadassu” అని కొడితే
ఇంచుమించు అన్ని వీడియోలూ చూడవచ్చును. ఉదాహరణకి ప్రారంభ సభ ఈ క్రింది లంకె లో
చూడవచ్చును.
https://www.youtube.com/watch?v=uBsgzHuxKuE
సదస్సు రెండు రోజులూ సవ్యసాచిలా ఒక చేత్తో విడియో, మరో
చేత్తో ఫోటోలు తీసి, రాత్రి ఇంటికెళ్ళి అన్నీ కంప్యూటర్ లోకి, ఇంటర్నెట్ లోకి
ఎక్కించి ఈ సదస్సుని చరిత్ర పుటల్లో యదాతథంగా నిక్షేపితం చేసిన రఘు ధూళపాళకి అందరం
ఋణపడి ఉన్నాం.
1 comment:
దిగ్విజయంగా నిర్వహించినందుకు అభినందనలు. లండన్లో ముగించిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇక్కడ సదస్సు జరపటంలోని మీ పట్టుదల శ్రమ మరింత అభినందించదగినవి.
Post a Comment